Sun. Apr 21st, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై, మార్చి 7 ,2024:యుగయుగాలుగా ఈ పవిత్ర భారతభూమి ఎందరో గొప్ప దివ్య పురుషుల అడుగుజాడలతో పావనమైంది. మార్చి 9 న మహాసమాధి పొందిన స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి, మార్చి 7 న మహాసమాధి పొందిన పరమహంస యోగానంద అలాంటి ఇద్దరు మహా పురుషులుగా అంతటా గుర్తింపు పొందినవారు.

ఎందరికో ప్రేరణనిచ్చే వారి జీవితాలు అసంఖ్యాకమైన భక్తుల సామూహిక చైతన్యంలో ప్రేమ,జ్ఞానాన్ని వ్యాప్తి చెందించి తద్ద్వారా అంతిమ లక్ష్యమైన ఈశ్వరునితో ఏకత్వం సాధించే దిశగా భక్తుల జీవన పరిణామం వేగవంతమయేందుకు తోడ్పడింది.

యోగానంద స్వామి శ్రీయుక్తేశ్వర్ ను-చూసేవారికి అనుకోకుండా కలిసినట్టు అనిపించినా, స్పష్టంగా ఒక దివ్య ప్రణాళికను అనుసరించి-కాశీలో మొదటిసారి కలిశారు. ఆయన అప్పుడు ముకుందలాల్ ఘోష్ అనే పేరుతో ఉన్న యువకుడు కానీ తన జీవితంలోకి ఒక నిజమైన గురువు ప్రవేశించి ఆయన ప్రేమపూరిత మార్గదర్శకత్వం తనను పరివేష్టించాలని తపిస్తున్నవాడు.

కాశీలోని శ్రీయుక్తేశ్వర్ తల్లి ఇంటి మేడ మీద ఆహ్లాదకరమైన ఒక సాయంకాలం జరిగిన ఆ మొదటి సమావేశం వెంటనే ఆనందకరమైనదిగా ఉన్నా, అసమ్మతితో ముగిసింది. ఆ మొదటి సమావేశం గురించి, ఆ తరువాత రానున్న రోజుల్లో తన గురువుతో కలిసి గడిపిన కాలాన్ని గురించీ అత్యధికంగా అమ్ముడుపోతున్న తన ప్రఖ్యాత గ్రంథరాజం ‘ఒకయోగి ఆత్మకథ’లో యోగానంద వర్ణించారు.

కానీ ఆ తరువాత రానున్న ఏళ్లలో, కోల్ కతాకు దగ్గరిలో ఉన్న శ్రీరాంపూర్ లోని శ్రీయుక్తేశ్వర్ ఆశ్రమంలో ఆ గొప్ప గురువు తీవ్రమైన క్రమశిక్షణకు గురిచేస్తూ, ఆంతరికంగా ప్రేమ నిండిన హృదయంతో అప్పుడే రెక్కలు తొడుగుతూ రానున్న ఏళ్లలో ప్రపంచ ప్రఖ్యాత గురువుగా కీర్తి నార్జించనున్న ఆ భావి సన్యాసిని సానపట్టి మలిచారు.

తన గురువు మార్గదర్శకత్వపు ఛత్రఛాయలో ఆ ప్రారంభ సంవత్సరాలు యోగానంద వ్యక్తిత్వాన్ని, ఆయనలోని ఆంతరిక లక్షణాలను ఏ విధంగా తీర్చిదిద్దాయంటే, ఆయన భవిష్యత్తులో క్రియాయోగ శాస్త్రాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన ప్రధాన ప్రవక్తగా రూపొంది, రానున్న ఎన్నో యుగాలకు సాటిలేని ఒక ఆధ్యాత్మిక వారసత్వాన్ని రూపొందించారు.

ఈ యువ సన్న్యాసిని సముద్రాలు దాటి క్రియాయోగ జ్ఞానాన్ని పశ్చిమ దేశాల్లో వ్యాప్తి చెందించడానికి ఒక ధ్రువతారగా వెలుగొందే విధంగా సిద్ధం చేయమన్న మహావతార్ బాబాజీ, లాహిరీ మహాశయుల తిరుగులేని ఆదేశాన్ననుసరించి తనను తీర్చిదిద్దిన తన గురువు కలలను నిజం చేస్తూ యోగానంద ఆయన తన మీద ఉంచిన బాధ్యతను దివ్యమైన రీతిలో నెరవేర్చారు.

యోగానంద స్థాపించిన సెల్ఫ్-రియలై జేషన్ ఫెలోషిప్ (SRF) ఎన్నో దశాబ్దాలుగా క్రియాయోగ బోధనలను ఆసక్తి గలిగిన అన్వేషకులకు అందించే బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చింది.

శాస్త్రీయ ధ్యాన ప్రక్రియలు సాధన చేయడానికి యోగానంద రూపొందించిన క్రమానుగత ఉపదేశాలు భారతదేశంలో గృహ-అధ్యయన పాఠాల ద్వారాను, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (YSS) మొబైల్ ఆప్ ద్వారాను భక్తులకు అందుబాటులో ఉన్నాయి.

గురుశిష్యుల మధ్య ఉండే ఆదర్శ సంబంధం స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి, యోగానంద రూపంలో ఉత్కృష్టంగా వ్యక్తమైంది. ఈ ఇద్దరు ఋషులూ రానున్న కాలాల్లోని తమ శిష్య గణాలు తమ నుండి నేర్చుకొనే విధంగా మానవ నాటకంలో జీవించారు.

ఇద్దరూ అందరు సామాన్య మానవుల లాగానే ఎదురుదెబ్బలు తిన్నారు. అయినా తమ మార్గంలోని నిజమైన భక్తులతో వారు పలికిన ప్రతి మాట, ప్రతి చూపూ, ప్రతి స్పర్శకు శాశ్వత ప్రాధ్యాన్యత ఉంది.

స్వామి శ్రీయుక్తేశ్వర్ ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవలసిన రీతిలో చెప్పినట్లు “నువ్వు కనక ఇప్పుడు ఆధ్యాత్మిక కృషి చేస్తున్నట్లయితే ఇకముందు ప్రతీదీ మెరుగవుతుంది.”

మహాత్ములైన తన గురువుకు నిజమైన శిష్యునిగా తన గురువు నోటి నుండి వెలువడిన ప్రతి మాటనూ స్వీకరించి, నెరవేర్చడానికి యోగానంద ఉదాత్తమైన రీతిలో కృషి చేశారు.

తాము గడిపిన ఆదర్శ జీవనం చూపే శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రభావం, తాము ఈ భూమిపై గడిపిన పావన జీవితాల తేజో ప్రభావం వల్ల శ్రీయూక్తేశ్వర్, యోగానంద తమ లక్షలాది శిష్యుల హృదయాలలో ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకొన్నారు.

యోగానంద తదనుగుణంగానే, ఉత్తేజకరమైన ఈ వ్యాఖ్య చేశారు. “ఈశ్వరా, ఈ సన్యాసికి పెద్ద సంసారమిచ్చావు కదయ్యా!“ మరింత సమాచారం కోసం: yssofindia.org సందర్శించండి.