365తెలుగుడాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, మార్చి10, 2025: పాత లే ఔట్ల కబ్జాలపై హైడ్రా ప్రజావాణికి వరుసగా ఫిర్యాదులు అందుతు న్నాయి. తండ్రులు అమ్మిన భూములను వారసులు పాసుపుస్తకాలు సృష్టించుకుని తమ పేరిట చేసుకుని, లే ఔట్లను తొలగించి పంట పొలాలుగా మార్చుకుంటున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి.

సోమవారం హైడ్రా నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 63 ఫిర్యాదులు అందగా, వాటిలో ఎక్కువగా పాత లే ఔట్ల ఆక్రమణల గురించి ఉన్నాయి. రహదారులు, పార్కులను కబ్జా చేయడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.

అధికారులను అడ్డం పెట్టుకుని భూకబ్జాలు..!

మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని లే ఔట్లను కబ్జా చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాధితులు వాపోయారు.

తుర్కయాంజల్ చెరువులో వర్షపు నీరు అడ్డం!
తుర్కయాంజల్ చెరువులోకి వెళ్లే వర్షపు నీటికి అడ్డంగా గోడ కట్టడంతో వరద ముప్పుకు గురవుతున్నామని ఏవీనగర్-2 కాలనీవాసులు ఫిర్యాదు చేశారు.

ఘట్‌కేసర్‌లో 88 ప్లాట్లపై కబ్జా..

ఘట్‌కేసర్ మండలం ప్రతాప్‌ సింగారంలో 1989లో 390 ప్లాట్లతో లేఔట్ ఏర్పాటు చేయగా, వాటిలో 88 ప్లాట్లు కబ్జాకు గురయ్యాయి. దాదాపు 6.14 ఎకరాల భూమిని ధరణి ద్వారా పాసుపుస్తకం సృష్టించి హస్తగతం చేసుకున్నారని బాధితులు ఆరోపించారు.

ఇది కూడా చదవండి…మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా శ్రీలీలకు ప్రత్యేక సన్మానం

ఇది కూడా చదవండి…విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తీసుకుంటారా..?

బోడుప్పల్‌లో ప్రభుత్వ భూమి కబ్జా..

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దేవేందర్‌నగర్ కాలనీలో 1200 గజాల ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా ఆక్రమిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ స్థలాన్ని పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలకు కేటాయిస్తే, మంచి క్రీడామైదానం ఏర్పాటు చేయవచ్చని ప్రజలు కోరుతున్నారు.

పార్క్ స్థలం కూడా కబ్జా..

రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీ లోని శ్రీరంగాపురం 24వ వార్డులో 1050 గజాల పార్కు స్థలాన్ని మాజీ ప్రజాప్రతినిధి ఆక్రమించారని కాలనీవాసులు ఆరోపించారు. అంతేకాదు, అక్కడి ఆరు కాలనీలకు వెళ్లే రహదారిని కూడా మూసివేశారని ఫిర్యాదు చేశారు.