Mon. Dec 23rd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూలై 2,2024: ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న అనేక సంఘటనలు రాజకీయ పరిశీలకులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. తన ప్రత్యర్థి అయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీకి చెందిన (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ)కార్యాలయాలను కూల్చివేసే పని పెట్టుకున్నారని ఆరోపిస్తున్నారువైసీపీ నాయకులు.

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ముఖ్యమైన పాత్ర ఉందనేది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్రమైన విభేదాలు ఉండటమనేది సర్వసాధారణం. కానీ.. భిన్నాభిప్రాయాలను వ్యక్తీకరించే లేదా విమర్శించే గళాన్ని తమ చర్యలతో అణగదొక్కలానుకోవటం హర్షించదగిన విషయం కాదు.

మన రాజ్యాంగంలో ఆలోచనా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని ప్రమాణం చేసిన ఏ నాయకుడూ ఈ విషయాన్ని మరచిపోకూడదు. ఇలాంటి నిరంకుశ చర్యలను సమాజం ఏవిధంగానూ సమర్థించదు. ఇక్కడ.. చంద్రబాబు నాయుడు త‌న మిత్రుడైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట‌లను కాస్త జాగ్రత్తగా వినాల్సిన అవసరం ఉంది.

ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఉన్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని.. అయితే ఏకాభిప్రాయంపైనే పాలన ఆధారపడి ఉంటుందని నరేంద్ర మోదీ ఎలాంటి సందిగ్ధత లేకుండా చెప్పారు. ఇది కేవలం ‘రాజ్యాంగ నైతికత’కి సంబంధించిన ప్రశ్న మాత్రమే కాదు, చట్టపరమైన బాధ్యత కూడా. కొన్నేళ్లుగా.. రాజకీయ నాయకులను సంతృప్తిపర్చటానికి.. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగాన్ని నియంత్రించేందుకు ఉన్నత న్యాయవ్యవస్థ తన అధికారాలను వినియోగించట్లేదు అన్నది ఓ వాదన అయితే.. రాజ్యాంగంలో స్పష్టంగా నిర్వచించిన అధికార విభజన అనేది ఆధిపత్యాన్ని చెలాయించేందుకు వాడుకోడానికి కాదని శాసనసభకు గుర్తు చేసే సాహసం కూడా చేయట్లేదన్నది మరో వాదన. అనూహ్యమైన జనాదరణ పొందిన నాయకుడు కూడా అప్పడప్పుడు నిరంకుశత్వంతో వ్యవహరించే అవకాశం లేకపోలేదు.

దురదృష్టవశాత్తు.. చంద్రాబాబు రాజకీయ ప్రత్యర్థిపై కక్ష సాధింపు చర్యకు ఉపక్రమించటం ఒక్కటే ఇక్కడ ఆందోళన చెందాల్సిన విషయం కాదు. అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌న‌పై విమ‌ర్శలు ఎక్కుపెట్టిన ఓ టీవీ ఛానెల్‌ మీద.. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే చంద్రబాబు నిషేధం విధించారు. ఆ టీవీ ఛానెల్‌కు తెలుగు మాట్లాడేవారిలో 70 శాతానికి పైగా వీక్షకులు ఉండటం గమనార్హం.

అయితే.. విమర్శించే గొంతును నొక్కేందుకు ఆయన చేసిన ప్రయత్నం మిస్ ఫైర్ అయింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆ ఛానెల్‌కు ఉపశమనం దొరికింది. పత్రికలు, మీడియా అనేది.. ప్రజాస్వామ్యానికి నాలుగో పిల్లర్ అని.. ఏపీ సీఎం మరోసారి గ్రహించాలి. పౌరులు తమ అభిప్రాయాలను వెల్లడించే వేదికే మీడియా. అలాంటి మీడియాను అణచివేయడానికి.. విమర్శించే గొంతు నొక్కేయటానికి ప్రయత్నించటమనేది.. భావప్రకటనా స్వేచ్ఛ అనే ప్రాథమిక హక్కును హరించివేయటమే అవుతుంది.

ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని అందించేందుకు ఎన్నో పోరాటాలు జరిగాయి. యుద్ధభూమిలో ఆయుధాలతో చేసిన పోరాటాలతో పోలిస్తే.. ఇప్పుడు చేసే ఈ రాజకీయ పోటీలు ఎంత. అయినా.. విజేత ఎప్పుడూ ఓడిపోయిన వారిని నామరూపాల్లేకుండా చేయాలని అనుకోడు. ఈ విషయంలో.. నరేంద్ర మోదీ చెప్పిన మాటలు ఆయనకు బాగా గుర్తుపెట్టుకోవా. ‘సబ్ కా సాథ్.. సబ్ కా విశ్వాస్’.. ఈ నినాదంలో చాలా గొప్పతనం ఉంది. ముఖ్యమైంది ఏమిటంటే.. ఆలోచన అనేది ఆచరణలో కూడా కనిపించాల్సి అవసరం ఉంది. ఒకనొక సందర్భంగా.. భారత ఫెడరలిజం గురించి మాట్లాడిన మోదీ.. ‘సహకార పోటీ’ గురించి కూడా ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడే కాదు మిగతా పవర్‌ఫుల్ సీఎంలు కూడా తమ రాష్ట్రాల్లో ఈ కాన్సెప్ట్ గురించి ఆలోచించాల్సిన సమయం ఇది. ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నిస్సందేహంగా సంచలనాత్మక విజయాన్ని సాధించారు.

అయితే ఎంతో అనుభవం, తెలివితేటలున్న ఆయనకు.. ఈ ఎన్నికల్లో దక్కిన అదృష్టం ఎప్పుడైనా కీలక మలుపు తీసుకునే అవకాశం లేకపోలేదన్నది తెలుసు. వచ్చే ఐదేళ్ల వరకు ఆయన సంఖ్యాపరంగా మెజారిటీని నిలుపుకోవచ్చు కానీ.. ఏకాభిప్రాయం లేకుండా రాష్ట్రాన్ని పరిపాలించడం మాత్రం అసాధ్యం. ఆయనతో పాటు కూటమిలో ఉన్న ఇతర రాజకీయ పార్టీలు కూడా ప్రజలకు, విభిన్న ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆయన ఓ రాజనీతిజ్ఞుడిలా ప్రవర్తిచాల్సిన అవసరం ఉంది. ప్రజలందరినీ తనతో నడిపించేందుకు.. విశ్వసనీయమైన స్థితిస్థాపకతను ప్రదర్శించాలి.

గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు తనను తాను ఓ విజనరీ లీడర్‌గా నిరూపించుకున్నారు. ఫ్యూడల్ నిజాం షాహీల కాలం నాటి హైదరాబాద్‌పై పూర్తిగా అభిప్రాయం మార్చుకునేలా.. సిలికాన్ వ్యాలీతో పోటీపడేలా సైబరాబాద్‌గా ఎలా మార్చారో గుర్తుచేసుకోవాలి. మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం, రాష్ట్రంలోని ముస్లింల ప్రయోజనాలను కాపాడటానికి ఆయనలో కమిట్మెంటే.. చంద్రబాబును జాతీయ స్థాయి నాయకునిగా నిలబెట్టాయి.

చివరగా చెప్పొచ్చేదేంటంటే.. ప్రతిపక్షం, భావప్రకటనా స్వేచ్ఛ లేకుండా నిజమైన ప్రజాస్వామ్యం ఉండదు. నిరంకుశ అధికారులు, నిరంకుశులకు కూడా ప్రజాస్వామ్యంలో చోటు ఉండదు. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు ఇదే సరైన సమయం. ప్రతిపక్షాలతో కలహాలు విధ్వంసకరం కాకపోయినా అభివృద్ధికి విఘాతం కలిగించే విధంగా ఉన్నప్పుడు.. వారితో సయోధ్యను స్వీకరించడంలోనే నాయకుడి జ్ఞానంతో పాటు ప్రజల సంక్షేమం ఆధారపడి ఉంటుంది.

error: Content is protected !!