Sat. Dec 21st, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 15, 2024: జ్వరం, తలనొప్పి, పంటి నొప్పి… ఏ నొప్పైనా, అందరూ ముందుగా పారాసెటమాల్‌ తీసుకోవడం సహజం. ఇది ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే నొప్పి నివారిణి. కానీ, ఈ సాధారణ మందు మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపవచ్చని, అది “అమృతం విషం అవుతుంది” అనే సామెతను గుర్తుచేస్తుంది.

పారాసెటమాల్‌ను అధిక మోతాదులో నిరంతరం తీసుకోవడం తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు. తాజా అధ్యయనాలు సైతం దీన్ని నిర్ధారించాయి. ఎడిన్‌బర్గ్ యూనివర్శిటీ చేసిన పరిశోధన ప్రకారం, అధిక మోతాదు కాలేయంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. పారాసెటమాల్ అధికంగా తీసుకుంటే, అది కాలేయ వ్యాధికి ప్రధాన కారణం అవుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

పారాసెటమాల్ సాధారణంగా 500(ఎంజీ) మిల్లీగ్రాములు, 650 (ఎంజీ)మిల్లీగ్రాములు, మోతాదులో లభిస్తుంది. సాధారణంగా ఒక కిలో శరీర బరువుకు15 mg మోతాదును మించి తీసుకుంటే, అది కాలేయ పనితీరును ప్రభావితం చేయవచ్చు. 2020లో నిర్వహించిన మరో అధ్యయనం, పారాసెటమాల్ అధిక మోతాదు హెపాటోటాక్సిసిటీకి (కాలేయానికి హానికరమైనదిగా) ప్రధాన కారణమని గుర్తించింది.

పారాసెటమాల్‌ను మొదటిసారిగా 1893లో జోసెఫ్ వాన్ మెరింగ్ సంశ్లేషణ చేశారు. 1950లలో యునైటెడ్ స్టేట్స్‌లో, ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా, పారాసెటమాల్ వాడకం విస్తృతంగా జరిగింది. ఆస్పిరిన్, ఇబుప్రోఫెన్ వంటి ఇతర నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAIDs) కడుపులో రక్తస్రావం, పూతలు వంటి తీవ్రమైన దుష్ప్రభావాలకు కారణమవుతాయి, కరోనా తర్వాత పారాసెటమాల్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నారు జనాలు. కానీ, ఇప్పుడు ఏ నొప్పికైనా పారాసెటమాల్‌ తీసుకోవడం సర్వసాధారణంగా మారింది.

అయితే, 24 గంటల్లో నాలుగు గ్రాముల పారాసెటమాల్ గరిష్టంగా అనుమతించిన మోతాదు. అంతకంటే ఎక్కువ తీసుకోవడం ఓవర్‌డోస్‌ అవుతుంది. పెద్దలు 500 mg మాత్రలను 24 గంటల్లో నాలుగు సార్లు తీసుకోవచ్చు. ఒక మోతాదు తర్వాత, తదుపరి మాత్రను కనీసం నాలుగు గంటల తర్వాత తీసుకోవాలి.

హెచ్చరిక : పారాసెటమాల్ వినియోగంలో జాగ్రత్తలు పాటించాలి. ఏ మందైనా అధిక మోతాదులో తీసుకుంటే, అది ఆరోగ్యానికి హానికరం అవుతుంది. అందుకే, డాక్టర్ సలహా తీసుకుని, సరైన మోతాదులోనే మందులు వాడాలి.

error: Content is protected !!