365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,జూలై 3,2022:శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవం మూడు రోజుల పాటు జరుగనుంది.
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఆలయ ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు.
ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఊంజల్ సేవ జరిగింది. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు పెద్దశేష వాహనంపై స్వామి, అమ్మవార్లు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.
పెద్దశేష వాహనం
ఏడుపడగలు గల ఆదిశేషుడు ఏడుకొండలకు, ఏడులోకాలకు సంకేతం. శేషుడు శ్రీనివాసునికి తిరుమలలో నివాసభూమి అయినా శ్రీనివాసమంగాపురంలో వాహనరూపంలో శ్రీవారిని స్తుతిస్తూ, స్వామికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేస్తున్నాడు. శ్రీవారికి విశ్రాంతికి, సుఖనిద్రకూ కారణమవుతున్నాడు. తనను, శేషుణ్ణీ దర్శించే భక్తుల్ని కాపాడుతానని, మీరందరూ శేషుని వలే తనకు నిత్య సేవకులుగా ఉండి సత్ఫలాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు అనుగ్రహిస్తున్నారు.