Wed. Jan 15th, 2025

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 9,2024: పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించి, రాష్ట్రంలో ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని స్పష్టంచేసింది.

అయితే, ఈ ఘటనపై అల్లు అర్జున్ బాధను వ్యక్తం చేస్తూ, మృతురాలి కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించారు.

ఇదే విషయంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ (ఆర్జీవీ) తనదైన శైలిలో స్పందించారు. ఈ ఘటనకు అల్లు అర్జున్‌ను నిందించడం హాస్యాస్పదమని, బెనిఫిట్ షోలను రద్దు చేయడాన్ని ట్రాఫిక్ ప్రమాదాలు జరుగుతాయని రోడ్లను మూసేయడానికి సమానమని వ్యాఖ్యానించారు.

పెద్ద సంఖ్యలో జనం గుమిగూడినప్పుడు తొక్కిసలాటలు జరుగడం ఆశ్చర్యకరమేమీ కాదని, సంధ్య థియేటర్ ఘటన కూడా అలాంటిదేనని వర్మ పేర్కొన్నారు.

తదుపరి దశాబ్దాలలో జరిగిన తొక్కిసలాట ఘటనలు, వాటిలో చనిపోయిన జనం సంఖ్య గురించి వికీపీడియా లింక్ షేర్ చేస్తూ, ఈ విషయంలో నిజమైన కారణం పోలీసులు జరిపే దర్యాప్తులో తెలుస్తుందని తెలిపారు.

థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం ఉంటే వారిని పట్టుకోవడం తప్పు కాదని, అయితే అల్లు అర్జున్‌ను నిందించడం పూర్తిగా తప్పుడు నిర్ణయమని వర్మ అభిప్రాయపడ్డారు.

బెనిఫిట్ షోల లక్ష్యం మీద కూడా వర్మ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. గతంలో బెనిఫిట్ షోలు విరాళాల కోసం నిర్వహించేవారని, అయితే ప్రస్తుతం వాటి ప్రధాన ఉద్దేశం సినిమాపై హైప్‌ను క్యాష్ చేసుకోవడమేనని తెలిపారు.

వీటిని బెనిఫిట్ షోలుగా పిలవడం కంటే స్పెషల్ షోలుగా పిలవడం సరైనదని అన్నారు. రెగ్యులర్ టీ, భోజనాలతో పోలిస్తే స్పెషల్ టీ, స్పెషల్ భోజనాలు ప్రత్యేకమైన విధంగా ఉంటాయి కాబట్టి, అవి ఖరీదైనట్లే, స్పెషల్ షోల టికెట్ ధరలను కూడా ఎక్కువగా పెట్టడం సహజమని వర్మ వివరించారు.

సంఘటనపై బాధను వ్యక్తం చేయడంతో పాటు, బెనిఫిట్ షోల అవసరం, ఉద్దేశం, మరియు నేటి పరిస్థితుల్లో వాటి ప్రాముఖ్యతపై వర్మ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.

error: Content is protected !!