365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,ఏప్రిల్ 1,2022 :తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం ఉదయం సింహ వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించారు. ఉదయం 8 నుంచి10 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా స్వామివారు నిరూపిస్తున్నారు.
వాహన సేవ అనంతరం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కల్యాణ మండపంలో శ్రీసీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు.
సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై శ్రీ కోదండరామస్వామివారు భక్తులకు కనువిందు చేయనున్నారు.