365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,తిరుపతి,జూలై10,2022:సృష్ఠిలోని సకల జీవరాశులు ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలో 16 రోజుల పాటు నిర్వహించిన షోడశదినాత్మక అరణ్యకాండ పారాయణ దీక్ష ఆదివారం మహా పూర్ణాహుతితో ముగిసిందని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. మహాపూర్ణాహుతి కార్యక్రమంలో ఈవో దంపతులు పాల్గొన్నారు. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివసుబ్రమణ్య అవధాని ఆధ్వర్యంలో వసంత మండపంలో అరణ్యకాండ పారాయణంలోని శ్లోకాల పారాయణం, ధర్మగిరి వేద విజ్ఞానపీఠంలో జప-తర్పణ-హోమాలు నిర్వహించారు.
ఈ సందర్బంగా ఈవో మాట్లాడుతూ లోక సంక్షేమం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ 16 రోజుల పాటు షోడశదినాత్మక అరణ్యకాండ పారాయణ దీక్ష నిర్వహించినట్లు తెలిపారు. వాల్మీకి మహర్షి సుందరకాండ. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కిందకాండ, యుద్ధకాండ మరియు ఉత్తరకాండలుగా రామాయణాన్ని రచించారన్నారు. ఇప్పటికే సుందరకాండ. బాలకాండ, అయోధ్యకాండ, యుద్ధకాండ, అరణ్యకాండలను పారాయణం చేశామన్నారు. పండితులతో చర్చించి, త్వరలో కిష్కిందకాండ పారాయణ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు ఈ పరాయణంలోని శ్లోకాలను వీక్షించిన, పఠించిన, శ్రవణం చేసిన సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు.
ధర్మగిరి వేద విజ్ఞానపీఠంలో..
ధర్మగిరి వేద విజ్ఞానపీఠంలోని ప్రార్థనా మందిరంలో ప్రతి రోజు అరణ్యకాండ పారాయణంలో భాగంగా జప-తర్పణ-హోమాదులు నిర్వహించారు. లోక క్షేమం కోసం 16 రోజుల పాటు ఉపాసకులు అకుంఠిత దీక్ష, శ్రద్ధలతో శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయస్వామి సమేత శ్రీ రామ మూల మంత్రానుష్ఠానం 27 లక్షల సార్లు జపించారు. జపంలో పదవ వంతు ఆవు పాలతో తర్పణం, తర్పణంలో 10వ వంతు హోమాలు నిర్వహించారు.
మహా పూర్ణాహూతి సందర్బంగా ఆదివారం ఉదయం మూల మంత్ర హోమాలు, శ్లోక హోమాలు, మండప దేవత హోమాలు, అంగ హోమాలు, పౌష్ఠిక హోమాలు, శాంతి హోమాలు, జయాతి హోమం, కుంభారాధన జరిగింది. తరువాత సమస్త దోషాలు తోలగి పోవాలని అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు సంకల్పం, హోమద్రవ్య పూజ, బలి ప్రదానం, ద్రవ్య సమర్పణ, వసోర్ధారా హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
వసంత మండపంలో :
అంతకుముందు తిరుమల వసంత మండపంలో ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివసుబ్రమణ్య అవధాని మాట్టాడుతూ అరణ్యకాండలోని 75 సర్గల్లో 2,454 శ్లోకాలు పారాయణం చేసినట్లు తెలిపారు. ఈ శ్లోకపారాయణ ద్వారా రాక్షస గుణాలు తొలగిపోయి సాత్విక గుణాలు అలవడతాయని చెప్పారు. ఆదివారం ఉదయం 70 నుండి 75వ సర్గ వరకు ఉన్న 188 శ్లోకాలను 16 మంది ఉపాసకులు అత్యంత దీక్షా శ్రద్ధలతో పారాయణం చేశారని వివరించారు. టీటీడీ ఎస్వీ సంగీత నృత కళాశాల అధ్యాపకులు శ్రీమతి వందన బృందం ” రామ రామ రామ్…భజే విశేష సుందరం సమస్త పాప ఖండనం.. ” , అనే సంకీర్తనను సుమధురంగా అలపించారు.ఎస్వీబీసి సిఇవో షణ్ముఖ కుమార్, వైఖానస ఆగమ సలహాదారులు,ఆస్థాన పండితులు మోహన రంగాచార్యులు, వి జి వోబాలి రెడ్డి, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం పండితులు పాల్గొన్నారు.