365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,జూన్ 21,2021: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో సోమవారం శ్రీ పెరియాళ్వార్ సాత్తుమొర శాస్త్రోక్తంగా జరిగింది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఈ కార్యక్రమం ఏకాంతంగా జరిగింది.ముందుగా శ్రీ లక్ష్మీ నారాయణస్వామివారి ఆలయం నుంచి శ్రీ పెరియాళ్వార్ ఉత్సవర్లను,శ్రీ గోవింద రాజ స్వామి ఆలయం నుంచి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవర్లను ఆలయంలోని కల్యాణ మండపంలోనికి వేంచేపు చేశారు.
అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారితో పాటు శ్రీ పెరియాళ్వార్‌కు వేడుకగా స్నపనతిరుమంజనం చేపట్టారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. తరువాత ఆస్థానం నిర్వహించి, ఆలయం లోపల ఊరేగించారు.శ్రీ మహావిష్ణువుకు పెరియాళ్వార్ పరమభక్తుడు. శ్రీ ఆండాళ్ అమ్మవారికి ఈయన తండ్రి. శ్రీ పెరియాళ్వార్ తులసిమాలలు కట్టి ప్రతిరోజు స్వామివారికి సమర్పించేవారు. తండ్రితో పాటు ఆరాధించిన ఆండాళ్ అమ్మవారు చివరకు స్వామివారినే భర్తగా భావించారు. శ్రీ పెరియాళ్వార్ ఎన్నో పాశురాలను రచించి స్వామివారికి అర్పించారు. ఈయనకు శ్రీమహావిష్ణువు సాక్షాత్కారం జరిగినట్టు అర్చకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెద్దజీయర్‌స్వామి,చిన్నజీయర్‌స్వామి, ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవోరాజేంద్రుడు, ఏఈవో రవికుమార్‌రెడ్డి, ప్రధానార్చకులు శ్రీనివాస దీక్షితులు, సూపరింటెండెంట్లు వెంకటాద్రి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ మునీంద్రబాబు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.