365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 8, 2024: జీవితంలోని ప్ర‌తి ద‌శ‌లోనూ బాలిక‌లు, మ‌హిళ‌ల‌కు కొన్ని ప్ర‌త్యేక‌మైన అవ‌స‌రాలు, అవ‌కాశాలు ఉంటాయి. వాటిద్వారా వాళ్లు త‌మ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. బాల్యం, కౌమారం, పిల్ల‌లు పుట్టే వ‌య‌సు, మెనోపాజ్, ఆ త‌ర్వాతి ద‌శ‌ల్లో మ‌హిళ‌లు త‌మ ఆరోగ్యాన్ని సంర‌క్షించుకోవ‌డానికి అవ‌స‌ర‌మైన ఆరోగ్య వ్యూహాల గురించి సికింద్రాబాద్ కిమ్స్ క‌డ‌ల్స్ ఆస్ప‌త్రికి చెందిన సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ గైన‌కాల‌జిస్టు, రోబోటిక్, లాప‌రోస్కొపిక్ స‌ర్జ‌న్, కాస్మెటిక్ గైన‌కాల‌జిస్టు డాక్ట‌ర్ వ‌సుంధ‌ర చీపురుప‌ల్లి స‌మ‌గ్రంగా వివ‌రించారు.

బాల్యం..

-అన్నిర‌కాల టీకాలు వేయించ‌డంతో పాటు, రూబెల్లా వ్యాక్సిన్ కూడా అందేలా చూడాలి. ఎందుకంటే గర్భధారణ ప్రారంభంలో ఒక మహిళ రుబెల్లా బారిన పడితే, అది పుట్టిన శిశువులో తీవ్రమైన లోపాలకు దారితీస్తుంది. రుబెల్లా ల‌క్ష‌ణాలు సాధార‌ణంగా బ‌య‌ట‌ప‌డ‌వు. గర్భిణుల‌కు 2- 3 రోజులు దద్దుర్లు వ‌చ్చి, త‌గ్గిపోతాయి. ఇది కేవలం అలెర్జీ ల‌క్ష‌ణ‌మేన‌ని భావించి దాన్ని ప‌ట్టిచుకోరు.

కానీ, అది శిశువుకు కూడా వ‌స్తే మాత్రం శాశ్వతంగా హాని కలిగిస్తుంది. కాబట్టి చిన్నప్పుడు ఈ వ్యాక్సిన్ ఇస్తే అంధత్వం, మానసిక వైకల్యంతో పుట్టే పిల్లల శాతాన్ని తగ్గించవచ్చు. గర్భధారణ ప్రారంభంలో స్త్రీకి రుబెల్లా ఉందని క‌నుగొంటే.. గ‌ర్భాన్ని కొన‌సాగించ‌వ‌ద్ద‌నే వైద్యులు సూచిస్తారు. అలాంటి శిశువులలో 80శాతం మంది ప్రభావితమవుతారు.

-శారీరక వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా ఊబకాయాన్ని నివారించాలి. ఎందుకంటే పిల్లలలో ఊబకాయం యుక్తవయస్సులో స‌మ‌స్య‌ల‌కు దారితీస్తుంది, ముఖ్యంగా పీసీఓఎస్ ఉన్న బాలిక‌ల‌కు యుక్త‌వ‌య‌సులో మ‌రిన్ని అనారోగ్యాల‌తో పాటు పెద్ద‌వ‌య‌సులో వైక‌ల్యాలు వ‌స్తాయి.

-పిల్లలు ఆరేళ్ల వ‌య‌సు నుంచి బరువు పెరిగితే, అది యుక్తవయస్సులో ఊబకాయానికి దారితీస్తుందనే విషయం తెలిసిందే. అందువల్ల తల్లిదండ్రులు టెన్నిస్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ వంటి క్రీడలు, లేదా ఇతర పిల్లలతో ఆరుబయట ఆడించ‌డం, ఇలా ఏ రూపంలోనైనా వ్యాయామాన్ని ప్రోత్సహించడం చాలా ముఖ్యం. పాఠశాలల్లోనే రోజూ గంటపాటు ఫిజికల్ ఫిట్ నెస్ ఉండేలా చూడాలి. ఇది కూడా చదవండి.. Women’s Day 2024 : పర్పుల్ కలర్‌తో మహిళా దినోత్సవానికి సంబంధం ఏమిటి?

యుక్తవయస్సు:

యుక్తవయస్సులో ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డం అనేది.. అవగాహన, జ్ఞానం, ప్రవర్తనలపై ఆధారపడి ఉంటుంది. బాలికల రుతుక్రమ ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం వల్ల రక్తహీనతను నివారించడంపై కూడా దృష్టి పెట్టాలి. యుక్తవయస్సు అంటే ఎదుగుదల కాలం కాబట్టి శారీరక, మానసిక స‌మ‌స్య‌ల నివార‌ణ‌కు మంచి పోషకాహారం, వ్యాయామం చాలా ముఖ్యం.

ఇదంతా మామూలు విష‌య‌మే అనిపించవచ్చు, కానీ మన జనాభాలో చాలా మందికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో, ఈ సాధారణ విష‌యాల గురించి తెలియదు. ఆరోగ్యం, పరిశుభ్రత, సరైన పోషకాహారం, వ్యాయామంపై తగిన జ్ఞానం లేకపోవడం వల్ల బాలికలు చాలా బాధపడుతున్నారు.

కౌమార ద‌శ‌:

-నేటి ప్రపంచంలో మ‌హిళ‌ల‌ పునరుత్పత్తి, లైంగిక ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి. కౌమారదశలో ఉన్నవారు ఆసక్తిగా ఉన్నప్పుడు, వారి హార్మోన్లు పెరుగుతున్నప్పుడు ఇంటర్నెట్ లో పుష్కలంగా సమాచారం అందుబాటులో ఉంది, కానీ అదంతా సరైన సమాచారం కావచ్చు లేదా కాకపోవచ్చు.

-వారికి సురక్షితమైన గర్భనిరోధకాలను అందించడం, లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు, అసురక్షిత గర్భస్రావాలపై సరైన సమాచారాన్ని అందించడం ముఖ్యం. త‌ద్వారా వారు భవిష్యత్తులో క్యాన్సర్, వంధ్యత్వం వంటి తీవ్రమైన అనారోగ్యాల బారిన ప‌డ‌కుండా నివారించవచ్చు.

-గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారించ‌డానికి అమ్మాయిలు లైంగికంగా చురుకుగా మారడానికి ముందే వారికి హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇవ్వాలి. భారతదేశంలో ఇది క‌చ్చితంగా 13-14 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎందుకంటే మన కౌమారదశలో ఎక్కువ శాతం మంది 16 సంవత్సరాల వయస్సు నుంచి లైంగికంగా చురుకుగా ఉంటారు.

పిల్ల‌లు పుట్టే వ‌య‌సు

-యువతుల్లో చాలామంది ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. దానివ‌ల్ల 40ల చివ‌ర్లో వ‌ర‌కు పెళ్లి చేసుకోవ‌డం లేదు. దానివ‌ల్ల పిల్ల‌లు పుట్ట‌డం ఆల‌స్యం అవుతోంది. నిజానికి ఇలాంటి ప‌రిస్థితుల్లో వారు కోరుకున్నప్పుడు పిల్ల‌లు పుట్ట‌రు. అది మానసిక, శారీరక ఒత్తిడికి దారితీస్తుంది. వారి అండాలు లేదా పిండాలను చిన్న వయస్సులోనే ఫ్రీజ్ చేయించ‌డం, వంధ్యత్వాన్ని కవర్ చేసే ఆరోగ్య బీమా పొందడం మంచిది. దీనివ‌ల్ల వాళ్ల‌పై ఒత్తిడి లేకుండా ఉంటుంది, అవసరమైనప్పుడు కెరీర్ మీద దృష్టి పెట్ట‌డానికి, కావాల‌నుకున్న‌ప్పుడు గ‌ర్భ‌ధార‌ణ‌ను ఆస్వాదించడానికి సహాయపడుతుంది.

-ప్రెగ్నెన్సీ కేర్ గురించి చాలా సమాచారం అందుబాటులో ఉంది, కానీ చాలా ముఖ్యమైన గర్భధారణకు ముందు సంరక్షణను విద్యావంతులైన దంపతులు కూడా పాటించడం లేదు! గర్భం ధరించడానికి ముందే మ‌హిళల్లో ఏవైనా వైద్య‌ప‌ర‌మైన‌, హార్మోన్ల ప‌ర‌మైన‌, లేదా జ‌న్యుప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఉన్నాయో లేవో చూసుకోవాలి. అలాంటివి ఉంటే గ‌ర్భంలో ఉండే శిశ‌వువుకు హాని క‌లిగే ప్ర‌మాదం ఉంటుంది. అందువ‌ల్ల గ‌ర్భం ధ‌రించాల‌ని భావించ‌డానికి క‌నీసం 3 నెల‌ల ముందు గైన‌కాల‌జిస్టును త‌ప్పనిస‌రిగా సంప్ర‌దించాలి.

మెనోపాజ్‌:

మ‌హిళ‌ల్లో ఉండే ఈస్ట్రోజ‌న్ అనే హార్మోన్, వారు 45 ఏళ్ల వ‌య‌సు స‌మీపించేకొద్దీ క్ర‌మంగా తగ్గ‌డం మొద‌ల‌వుతుంది. మెనోపాజ్ ద‌శ‌కు వ‌చ్చేస‌రికి అది పూర్తిగా పోతుంది. దానివ‌ల్ల వారికి మాన‌సిక‌, భావోద్వేగ ప‌ర‌మైన‌, శారీర‌క స‌మ‌స్య‌లు వ‌స్తాయి. హార్మోన్ రీప్లేస్‌మెంట్, కాల్షియం, విట‌మిన్ డి తీసుకోవ‌డం, శారీర‌క కార్య‌క‌లాపాలు, మంచి పోష‌కాహారం తీసుకోవ‌డం వ‌ల్ల ఆ త‌ర్వాత కూడా మ‌రో 20-25 ఏళ్లు చాలా చురుగ్గా ఉంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆస్టియోపోరోసిస్, కేన్స‌ర్లు, మధుమేహం, గుండె క‌వాటాల వ్యాధులను నివారించ‌వ‌చ్చు.గైన‌కాల‌జిస్టు డాక్ట‌ర్ వ‌సుంధ‌ర చీపురుప‌ల్లి.

ఇది కూడా చదవండి.. Women’s Day 2024 : పర్పుల్ కలర్‌తో మహిళా దినోత్సవానికి సంబంధం ఏమిటి?