Sat. Jul 27th, 2024

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 27, 2023: తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్ నిర్వహిస్తున్న 7వ తెలంగాణ రాష్ట్ర రెగట్టా ఈరోజు ప్రారంభమైంది. ఈ టోర్నీకి హైదరాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, నారాయణపేట, వికారాబాద్ , వరంగల్ ఆరు జిల్లాల నుంచి 59 ఎంట్రీలు వచ్చాయి.

తెలంగాణ ఇప్పుడు సెయిలింగ్‌లో పవర్‌హౌస్‌గా ఉంది. యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈ ఏడాది హైదరాబాద్‌లోని పలువురు ఉత్సాహవంతులైన యువకులను కొత్త సెయిలర్స్‌గా తయారు చేసింది. నగరానికి చెందిన ప్రీతి కొంగర ఆసియా క్రీడల్లో పాల్గొనడం రాష్ట్ర క్రీడా రంగానికి నూతనోత్తేజాన్ని అందించింది.

ఈ టోర్నీ ఫలితాలతో జనవరిలో ముంబైలో జరిగే నేషనల్స్‌లో రాష్ట్రం పోటీ పడే సెయిలర్లను ఎంపిక చేస్తారని ప్రధాన కోచ్, ఆతిథ్య యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడు సుహేమ్ షేక్ తెలిపారు. తెలంగాణ స్టేట్ రెగట్టాలో జూనియర్, సబ్ జూనియర్ కేటగిరీలలో 3 ఫ్లీట్‌లలో పోటీలు జరుగుతాయి.

రాష్ట్రానికి చెందిన దేశంలోని పలువురు అగ్రశ్రేణి సెయిలర్స్ ఇందులో పాల్గొంటారు. బాలికల విభాగంలో దేశంలో 1వ ర్యాంక్‌లో ఉన్న దీక్షిత కొమరవెల్లి, 3వ ర్యాంక్‌లో ఉన్న లాహిరి కొమరవెల్లి ఈ టోర్నీలో అగ్రస్థానం కోసం పోటీ పడుతున్నారు. హైదరాబాద్ జిల్లాకు చెందిన ఈ ఇద్దరు రసూల్‌పురాలోని ఉద్భవ పాఠశాలలో చదువుతున్నారు.

ఇదే పాఠశాలకు చెందిన వికారాబాద్‌ జిల్లా సెయిలర్ బన్నీ బొంగూర్ సబ్ జూనియర్ బాలురలో దేశంలో నం.5 ర్యాంక్‌లో ఉన్నాడు. అతనితో పాటు హైదరాబాద్‌కు చెందిన దేశ 8వ ర్యాంకర్ రిజ్వాన్ మహ్మద్ కూడా ఫేవరెట్లుగా పోటీలో ఉన్నారు.

జూనియర్స్‌లో బాలుర లేజర్ సెయిలింగ్‌లో టాప్ సీడ్ శ్రవణ్ కత్రావత్ ప్రస్తుతం దేశంలో నం.5 ర్యాంక్‌లో ఉంది. బాలికల్లో వైష్ణవి వీరవంశం ప్రస్తుత జూనియర్ నేషనల్ ఛాంపియన్. భారత్‌లో 7వ ర్యాంక్‌తో ఉన్న ఆమె పోటీ తక్కువగా ఉన్న ఈ విభాగంలో స్వర్ణం గెలిచే అవకాశం ఉంది.

‘ఈ సంవత్సరం టోర్నీలో పెద్ద సంఖ్యలో సెయిలర్స్‌ పాల్గొంటున్నారు. ప్రస్తుతం గాలులు చాలా తక్కువగా ఉన్నాయి. రాబోయే కొద్ది రోజులు మంచి వాతావరణం ఉంటుందని ఆశిస్తున్నాం. పోటాపోటీగా జరిగే రాష్ట్ర ఛాంపియన్‌షిప్ కోసం ఎదురుచూస్తున్నాం’ అని ఇటీవలే తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన దాడీ భోటే అన్నారు.