Thu. Dec 7th, 2023

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 13,2023:దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. వరుసగా రెండో రోజు ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ఆసియాలో హాంకాంగ్‌ను మినహాయిస్తే అన్ని సూచీలు ఎరుపెక్కాయి.

ఐరోపా, అమెరికా సూచీలు విలవిల్లాడాయి. మిడిల్‌ ఈస్ట్‌లో యుద్ధ భయాలు కొనసాగుతున్నాయి. అంచనాలను మించి అమెరికా ద్రవ్యోల్బణం పెరగడంతో నెగెటివ్ సెంటిమెంటు ప్రభలింది. ఐటీ కంపెనీల బలహీన గైడెన్స్‌ ఇందుకు తోడైంది.

అయితే స్థానిక ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉండటం, మిగిలిన రంగాల కంపెనీలు మంచి ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉండటం గమనార్హం. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 66,300, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 19,800 దిగువన ముగిశాయి.

క్రితం సెషన్లో 66,408 వద్ద ముగిసిన సెన్సెక్స్‌ నేడు 66,034 వద్ద మొదలైంది. ఆరంభం నుంచే నష్టాల్లోకి జారుకుంది. 65,895 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని అందుకుంది. 66,478 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. చివరికి 125 పాయింట్ల నష్టంతో 66,282 వద్ద ముగిసింది.

శుక్రవారం 19,654 వద్ద మొదలైన నిఫ్టీ 19,805 వద్ద గరిష్ఠాన్ని తాకింది. 19,635 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ మొత్తంగా 42 పాయింట్లు పతనమై 19,751 వద్ద క్లోజైంది. బ్యాంకు నిఫ్టీ 311 పాయింట్లు నష్టపోయి 44,287 వద్ద ముగిసింది.

నిఫ్టీ 50లో 23 కంపెనీలు లాభపడగా 27 నష్టపోయాయి. టాటా మోటార్స్‌ (4.73%), హెసీఎల్‌ టెక్‌ (2.72%), ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్ (2.44%), టాటా కన్జూమర్‌ (2.15%), నెస్లే ఇండియా (2.06%) షేర్లు లాభపడ్డాయి.

యాక్సిస్‌ బ్యాంక్‌ (2.40%), అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (2.29%), ఇన్ఫీ (2.23%), ఎస్బీఐ (1.68%), విప్రో (1.46%) షేర్లు నష్టపోయాయి. రంగాల వారీగా పరిశీలిస్తే బ్యాంకు, ఫైనాన్స్‌, ఐటీ, మీడియా, పీఎస్‌యూ బ్యాంకు, ప్రైవేటు బ్యాంకు సూచీలు ఎక్కువ పతనమయ్యాయి.

ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్‌ సూచీలు ఎగిశాయి. నిఫ్టీ అక్టోబర్‌ నెల ఫ్యూచర్స్‌ టెక్నికల్‌ ఛార్ట్‌ను పరిశీలిస్తే 19,800 వద్ద రెసిస్టెన్సీ, 19,675 వద్ద సపోర్ట్‌ ఉన్నాయి. ఇన్వెస్టర్లు స్వల్ప కాలంలో అల్ట్రాటెక్‌ సెమ్‌, టాటా మోటార్స్, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్, హీరో మోటోకార్ప్‌ షేర్లను కొనుగోలు చేయొచ్చు.

నిఫ్టీ పతనంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఇన్ఫోసిస్‌ కీలక పాత్ర పోషించాయి. యాక్సిస్‌ బ్యాంకు, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు తర్వాతి స్థానంలో నిలిచాయి.

అశోక్ లేలాండ్‌కు భారీ ఆర్డర్‌ వచ్చింది. తమిళనాడు ప్రభుత్వం 1666 బస్‌ ఛాసిస్‌ కోసం ఆర్డర్లు ఇచ్చింది. కంపెనీ వీటిని 2024, మార్చి లోపు సరఫరా చేయాలి. టాటా మోటార్స్‌ షేర్లు 5 శాతం పెరిగి జీవిత కాల గరిష్ఠానికి చేరుకున్నాయి.

ఈ ఏడాది ఇప్పటి వరకు ఈ కౌంటర్‌ 71 శాతం పెరగడం విశేషం. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఫలితాలు విడుదల చేసింది. గతేడాది ఇదే సమయంలోని రూ.329 కోట్లతో పోలిస్తే నికర లాభం 15 శాతం పెరిగి రూ.378 కోట్లుగా నమోదైంది. ఐటీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌లో 15.1 లక్షలషేర్ల చొప్పున చేతులు మారాయి.

పీవీఆర్ ఐనాక్స్‌లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్ ఫండ్‌ రెండు శాతం వాటా అమ్మింది. క్యూ2లో మంచి ఫలితాలు విడుదల చేసినా ఆనంద్‌ రాఠీ షేర్లు నష్టపోయాయి.

  • మూర్తి నాయుడు పాదం
    నిఫ్ట్ మాస్టర్
    స్టాక్ మార్కెట్ అనలిస్ట్
    +91 988 555 9709