365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 23,హైదరాబాద్: మత సామరస్య స్ఫూర్తితో పురోభివృద్ధికి తోడ్పాటునందించండి -టి.ఎస్.ఆర్టీసీ ఇ.డి (రెవెన్యూ, ఐటి), సంస్థ కార్యదర్శి పురుషోత్తం
మత సామరస్య స్ఫూర్తితో అందరూ కలిసి మెలిసి ఉంటూ సంస్థ పురోభివృద్ధికి కృషి చేయాలని, భిన్న సంస్కృతి, మతాలకు నిలయమైన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు, ఉద్యోగులు ఆయా పర్వదినాలను ఎంతో వైభవోపేతంగా జరుపుకోవడం శుభ పరిణామని ఇ.డి (రెవెన్యూ, ఐటి), సంస్థ కార్యదర్శి శ్రీ పురుషోత్తం అన్నారు. క్రిస్‌మస్ వేడుకలో భాగంగా బస్‌భవన్ ఆవరణలో సోమవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో ఇతర అధికారులతో కలిసి ఆయన క్రిస్‌మస్ కేక్‌ను కట్ చేసి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు చెప్పారు.
రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మలు బిజీ షెడ్యూల్డ్ ఉండటంతో ఈ కార్యక్రమానికి రాలేకపోయినప్పటికీ క్రైస్తవ సోదరులకు ప్రత్యేక శుభాకాంక్షల సందేశాన్ని పంపించారు. క్రీస్తు బోధనలు, శాంతి, అహింసా క్షమాగుణం సర్వమానవాళికి ప్రభావితం చేస్తాయని, పరమత సహనంతో వేడుకలను జరుపుకోవడం సత్ సంప్రదాయమని, ఇలాగే అందరూ కలిసి మెలసి వేడుకలు జరుపుకోవడం ద్వారా స్నేహపూర్వక వాతావరణం వెల్లివిరుస్తుందని వారు ఆకాంక్షించారు.
ఈ వేడుకలో ఇ.డి (రెవెన్యూ, ఐటి), సంస్థ కార్యదర్శి పురుషోత్తం మాట్లాడుతూ, దయామూర్తిగా ఏసు ప్రభువును ఆరాధించే క్రైస్తవ సోదరులతో పాటు ఇతర ఉద్యోగులు, సిబ్బంది క్రిస్‌మస్ వేడుకలో పాల్గొనటం మంచి పరిణామమన్నారు. సందేశకులు పాస్టర్ రెవరెండ్ డెవిడ్ జెఫానియా అన్ని మతాల ఉద్యోగులు సంస్థ అభ్యున్నతి కోసం సమష్టిగా పని చేయాలని చెబుతూ ఏసుప్రభువును ఆరాధిస్తూ దీవెనలు అందించారు.
ఈ సందర్భంగా ఎల్.వి.కుమార్, డానియల్, టి.అబ్రహం ప్రార్ధన గీతంతో అందరికీ స్వాగతం పలికారు. పవిత్రంగా భావించే బైబిల్ సందేశాన్ని ఇమాన్యుయల్ చదివి విన్పించారు. కొందరు ఉద్యోగులు ఆధ్యాత్మిక పరిమళ గీతాలను వీనుల విందుగా ఆలపించి అలరించారు. ప్రజా సంబంధాల శాఖ ఉద్యోగులు కిరణ్, సుధాకర్, తదితరులు క్రైస్తవ సోదరులతో కలిసి పని చేసి సభా కార్యక్రమ నిర్వహణలో తెరవెనుక సహకారం అందించారు.
సంస్థ అధికారులు మునిశేఖర్, శ్రీ రాజేంద్ర ప్రసాద్, విజయ కుమార్, రఘునాథరావు, రాంమోహన్ రావు, తదితరులు పాల్గొన్న సభా కార్యక్రమంలో సీనియర్ పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ జి.ఆర్.కిరణ్ అధ్యక్షత వహించారు. ఉద్యోగులు, సిబ్బంది, తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.