Wed. May 22nd, 2024
TTD will compose 14 thousand Annamayya chants

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యుస్,తిరుమ‌ల‌,జూలై 5, 2021: తిరుమ‌ల శ్రీవేంకటేశ్వరస్వామివారి తత్త్వాన్ని లోకానికి చాటిన అన్నమయ్య కీర్తనలలోని ఆధ్యాత్మికతత్త్వం, గొప్పతనం యువతకు చేరువ కావాలని టిటిడి అద‌న‌పు ఈవో ఏ.వి.ధ‌ర్మారెడ్డి వెల్లడించారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో సోమ‌వారం అద‌న‌పు ఈవో అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల రికార్డింగ్ సెల‌క్ష‌న్‌ క‌మిటీ స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

TTD will compose 14 thousand Annamayya chants
TTD will compose 14 thousand Annamayya chants

ఈ సందర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ శ్రీ తాళ్లపాక అన్నమయ్య కొన్ని వందల సంవత్సరాల క్రితమే శ్రీవేంకటేశ్వరస్వామివారి వైశిష్ఠ్యాన్ని ఆధారం చేసుకుని అనేక విషయాలను అనేక కోణాల్లో సామాన్య ప్రజలకు అందించారని తెలిపారు. అన్నమయ్య 32 వేల కీర్తనలను రచించగా 14 వేల కీర్తనలను స్వరపరిచేందుకు గుర్తించామని చెప్పారు. అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల రికార్డింగ్ సెల‌క్ష‌న్ క‌మిటీ యువ‌త‌కు ప్రాదాన్యం ఇవ్వాల‌ని, ఎంపికైన క‌ళాకారుల‌తో వెయ్యి కీర్తనలను ఎస్వీ రికార్డింగ్‌ ప్రాజెక్టు ద్వారా రికార్డింగ్ చేస్తామ‌ని చెప్పారు.

అన్న‌మ‌య్య హృద‌యాన్ని ఆవిష్క‌రించేలా సంకీర్త‌న‌లు అల‌పించే క‌ళాకారులను ఎంపిక చేయాల‌ని సూచించారు. క‌ళాకారుల‌కు ప్ర‌తి కీర్త‌న అర్థ‌ తాత్ప‌ర్యాలు వివ‌రించి, సంగీతం-సాహిత్యాల‌ను అను సంధానం చేస్తూ, ఆధ్యాత్మికంగా ప‌రిప‌క్వ‌త‌తో అల‌పించేలా చూడాల‌న్నారు. ఎస్వీబీసిలో ప్ర‌తి రోజు 30 నిమిషాలు అన్న‌మాచార్య, పురంద‌ర‌దాపులు, త‌రిగొండ వెంగ‌మాంబ‌ సంకీర్తన కార్య‌క్ర‌మాన్ని ప్ర‌సారం చేయ‌నున్న‌ట్లు వివ‌రించారు.

ఈ స‌మావేశంలో ఎస్వీబీసీ ఛైర్మ‌న్ సాయి కృష్ణ యాచేంద్ర, ఎస్వీ ఉన్న‌త వేద అధ్య‌య‌న‌ సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, దాస సాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి ఆనంద తీర్థచార్యులు, టిటిడి ఆస్థాన విద్వాంసులు గ‌రిమెళ్ల బాల‌కృష్ణ ప్ర‌సాద్‌, ప్ర‌ముఖ క‌ళాకారులు క‌న్యాకుమారి, మోహ‌న కృష్ణ‌, ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి, ఇత‌ర క‌ళాకారులు పాల్గొన్నారు.